Saturday, April 16, 2016

memevaram

మేమెవరం/ జ్వలిత
మీకు కడకో నడిమిట్లనో
గూడో  మేడో ఏదో ఒకటున్నది
నిలవ నీడ లేనోళ్ళం దేశదిమ్మరులం మా సంగతేంది
ఎర్రదో తెల్లదో ఏదో ఒక కారటున్నది బత్తెమిచ్చటందుకు
ఏ కార్డు లేనోల్లం
సంచార జాతులం మా బతుకేంది
చిన్నదో పెద్దదో ఏదో ఒక కొలువున్నది మీకు
బతుకు తెరువుకు
ఏదిలేని బహురూపు గాళ్ళం
మా ఉనికేంది
మీకు కోడో మేకో చివరాకరికి
సూకరమో ఉన్నది
పసందుగ విందులు చేసేందుకు
అడవి పచ్చులు గూడ దొరకని
పిట్టలోళ్ళం బతికేదెట్ల మేం
అన్నమెతక్కు కరువు
అచ్చరమెట్ల దొరుకుతది మాకు
అడ్రసు లేనోళ్ళం ఆధారెక్కడుంటది మాకు
ఓటు లిష్ట్ లేనోళ్ళం జనాభాలెక్కల ఎట్లుంటం

అప్పు కింద అమ్ముతడొకడు
ఖర్చుల కింద జమేస్తడొకడు
తప్పు కింద కాలె నూనెల కాలుస్తడొకడు
సాదలేక సంపుతడొకడు
కట్టుబాటంటడొకడు
కులం తీరంటడొకడు కట్టుకున్నోడు కన్నోడు కంటపడ్డ ప్రతోడు మా పాలి యములోళ్ళే
మాకే చట్టం లేదు
ఏ చట్టు బండల్లేవ్
మేము ఈ దేశపోళ్ళం కామా?
మాది ఏ దేశం?
మాకు న్యాయం చేసేదెవరు?
అంబేద్కర్ మాకు లేడా?
పూలే ది మా వాడ కాదా?
బుద్దుడి ధర్మం మాకు చెందదా?

గంగిరెద్దులోళ్ళ పిచ్చకుంట్లం
భోగమోళ్ళం పూసలోళ్ళం
మందులోళ్థం కాటి  కాపరులం
బైండ్లోళ్ళం డెక్కలోళ్ళం
బండొడ్డెరోళ్ళం బజారుకమ్మరోళ్ళం వీధినాటకలోళ్ళం
బైరూపులోళ్ళం
సంచార జాతులం
మీ నోరు తిరుగనోళ్ళం
మా కడుపు నిండనోళ్ళం
ఏ ఎజెండా ఎరుగనోళ్ళం
ఏ పార్టీకి యాదికి లేనోళ్ళం
మేమెవరం ? మా దేశమెక్కడ ?
మేం భారతీయులం కాదా ?
ఏ మా కొడుకు యిక నాయకుడు కాడా..? మేమెవరం..?
====(((=)))=====
జ్వలిత-9989198943
16/04/2016(12am)

Wednesday, April 13, 2016

బానిసకు బానిస

బానిసకు బానిస/ జ్వలిత
నేను శత్రు శిబిరం లో శరణార్థిని
నా జీవితం నిర్ణయాత్మక  వెలివాడ
నా గాయం తడి ఆరిన ఎడారి
నా గళం అనివార్య యుద్దాల నడుమ
ఆత్మగౌరవ గీతాలాపన
నా కలం అస్తిత్వ ప్రసవాల ఆర్తనాదం
నాకు పాఠకులుండరు
ప్రేక్షకులు కూడా ఉండరు
నిత్యం పహారా కాస్తూ శత్రు సైన్యం నా చుట్టూ
నా అవసరాల ఉనకి ఉండదు
నా హక్కుల చర్చ ఉండదు
నా ఊహలను, వ్యూహాలను దోచుకొని
మరొకరి విజయ గాథల ప్రచారం నిత్యం
సముద్ర ఘోష నడుమ నా బృందం భజన
నా నాయకుడు చెంచాలకు గ్లాసులందిస్తూ ఒకసారి
గాజులందిస్తూ మరొకసారి
మురికి గుంటల్లో దొర్లుతుంటాడు
నా సహచర బృందం అరమోడ్పు కన్నులతో
నా చరిత్రను తాకట్టు పెడుతూ జాతర చేస్తారు
నేను శత్రు శిబిరంలో శరణార్థిని(saranaardhi)
నేనొక బానసకు బానిసను
నేనొక బీసీని
------===---------
జ్వలిత- 9989198943
13/04/2016,(3.30pm)

సన్మానం

ఖమ్మం కథలు ఆవిష్కరణ సందర్భంగా .. 

ఖమ్మం రచయిత్రులు జ్వలిత గారిని సన్మానించిన చిత్రం ..









 ఖమ్మం రచయితల సంఘం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు   _జ్వలిత .