మనిషి బుద్ధికి చిలుము పట్టినట్లు
మానవత్వపు మెట్లకు పాకురు పట్టినట్లు
చానాళ్ళ నుండి పేరుకు పోయిన నమ్మకాలు
మసీదుల్లో, మందిరాల్లో అసహాయపు పావురాళ్ళు
శాంతమో, మూఢమో, అసమర్ధమో
ప్రతిసారి ఎక్కడెక్కడో నమ్మకద్రోహంలా
బాంబు పేలుతూనేవుంది
గుక్క పట్టినపిల్లవాడిని ఏమార్చేందుకు
చప్పట్లు కొట్టినట్టు
పట్టించుకోని తల్లి కోసం
కాళ్ళు నేలకు కొట్టినట్టు
మాట వినిపించుకోని భర్తపై కోపం
వంట పాత్రల్లా మోగినట్టు
సీరియల్లో మునిగిన భార్యకై
తలుపు విసిరి కొట్టినట్టు
ప్రజల దృష్టి మరల్చే ప్రభుత్వంలా
మనలను భయపట్టే మతంలా
జనాలకు మత్తు పెట్టే ఛానల్ లా
అప్పుడప్పుడు యింటి దొంగలా
బాంబు పేలుతూనేవుంది
అమాయకులు బలి అవుతున్నారు
బస్సులు కాల్చబడుతున్నాయి
మసీద్ కు దెబ్బ తగలగానే
మందిరం అబ్బా అంటూంది
కోవెల దెబ్బ తింటే
మసీద్ అయ్యో అంటూంది
యిద్దరికి కలిపి శఠగోపం పెడ్తుందెవరు
అల్లా ఆలకించడం లేదా - దైవం తిలకించడం లేదా
పత్రికలు మసిపూస్తున్నాయి - ప్రజలకు బూడిద మిగులుస్తున్నాయి
ఉమ్మడి శత్రువును వెతకడంలో - నేముక్కంటి నౌతా
సోదరా నీ కన్నొకటి అరువిస్తావా?
ఇంద్రునిలా శరీరమంతా కన్నులు నేనౌతా
( మక్కా మసీదులో 18 - 05 - 2007 న జరిగిన బాంబు పేలుడు సంఘటనపై )
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
కవిత బాగుంది.
చిన్నచిన్న ప్రతీకలు బాగున్నాయి
.... జాన్ హైడ్ కనుమూరి
Post a Comment